సూర్య తెలుగు సినిమా.. బోయపాటి డైరెక్షన్?

22-01-2021 Fri 16:45
  • తెలుగులో కూడా మార్కెట్ కలిగివున్న సూర్య 
  • ఎప్పటి నుంచో తెలుగు సినిమా కోసం ప్రయత్నం  
  • బోయపాటి చెప్పిన కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్
  • ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో నిర్మాణం
Boyapati to direct Tamil hero Surya

కొంతమంది తమిళ హీరోలకి మన తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అందుకే, వారికంటూ ఇక్కడ కొంత మార్కెట్ కూడా వుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే తమ కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆయా హీరోలు చేబడుతుంటారు. అలాంటి ఫాలోయింగ్ వున్న హీరోలలో సూర్య కూడా ఒకరు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగు నాట కూడా మంచి కలెక్షన్లు రాబట్టి సక్సెస్ అయ్యాయి.

ఇదిలావుంచితే, తెలుగులో తనకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్ట్రెయిట్ తెలుగు సినిమా ఒకటి చేయాలని సూర్య ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. ఈ విషయంలో గతంలో కొందరు దర్శకులను సంప్రదించడం.. కథలు వినడం కూడా జరిగింది. అయితే, ఇన్నాళ్లకు ఆయన కోరిక తీరుతోందని అంటున్నారు. ఆయన తెలుగులో నటించే సినిమా దాదాపు ఓకే అయిందనీ, దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడనీ తెలుస్తోంది.

ఇటీవల బోయపాటిని కలిసినప్పుడు ఆయన చెప్పిన యాక్షన్ ఓరియెంటెడ్ కథ సూర్యకు బాగా నచ్చిందట. దాంతో ఆ ప్రాజక్టుకి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసివుంది.