Sonia Gandhi: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కుదిరిన ముహూర్తం

  • మే 29న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక
  • ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ
  • సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ సోనియాగాంధీ
Date fixed for Congress president election

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. మే 29న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ దీనికి సంబంధించి ప్రతిపాదనలను చేసింది. ఈ సమావేశంలోనే మే 29వ తేదీని ఖరారు చేయబోతున్నారు.

ఈ సమావేశంలో సోనియాగాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. జాతీయ భద్రతపై రాజీపడటం దారుణమని కేంద్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా సోనియా మండిపడ్డారు. బాలాకోట్ పై ఎయిర్ స్ట్రయిక్స్ చేయడానికి మూడు రోజుల ముందే రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి మరొకరితో జరిపిన వాట్సాప్ సందేశాలలో ఈ దాడుల అంశం గురించి మాట్లాడిన ఘటన గురించి స్పందిస్తూ సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.

సైనిక రహస్యాలు బయటకు రావడం రాజద్రోహం కిందకు వస్తుందని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందని మండిపడ్డారు. ఎప్పుడూ దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడే వారి అసలైన వైఖరి ఏమిటో ఇప్పుడు బయటపడిందని అన్నారు.

ఆలోచన లేకుండా హడావుడిగా వ్యవసాయ చట్టాలను రూపొందించారనే విషయం రైతులు చేస్తున్న నిరసనలతో బయటపడిందని సోనియా చెప్పారు. ఆహార భద్రతను ఈ చట్టాలు నాశనం చేస్తాయని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై తమ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు.

More Telugu News