మళ్లీ మోదీకే జై కొట్టిన ప్రజలు​: 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వేలో వెల్లడి

22-01-2021 Fri 15:10
  • ప్రధానిగా ఎక్కువ మంది కోరుకుంటోంది మోదీనే
  • 74 శాతం మంది అభిప్రాయం ఇదే
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీకే పట్టం
  • మోదీ కేబినెట్ లో అమిత్ షాకే పట్టం
  • ఇండియాటుడే–కార్వీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి
Pandemic recession protests couldnt lock down PM Modi

కరోనా మహమ్మారి, లాక్ డౌన్, రైతుల నిరసనలు, ఆర్థిక మాంద్యం తాలూకు మందగమనాలు.. ఇవేవీ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాను చెరిపేయలేకపోయాయి. ఇప్పటికీ దేశ ప్రధానిగా ఆయన్నే ఎక్కువ మంది కోరుకుంటున్నారంటే ఆయనకు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్వీ ఇన్ సైట్స్ తో కలిసి ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ విషయం తేలింది.

జనవరి 3 నుంచి జనవరి 13 మధ్య  దేశవ్యాప్తంగా 97 లోక్ సభ, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,232 మందిని సర్వే చేశారు. కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 73 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 23 శాతం అత్యంత అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. 50 శాతం మంది బాగుందన్నారు.

మొత్తంగా 74 శాతం మంది ఆయన్నే ప్రధానిగా కోరుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టులో 78 శాతం మంది మోదీని ఇష్టపడగా.. ఇప్పుడది 4 శాతం తగ్గింది. 66 శాతం మంది ప్రజలు బీజేపీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీకే 291 సీట్లు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తేలింది.

మోదీ కేబినెట్ లో అమిత్ షాకే జనం పట్టం కట్టారు. ఉత్తమంగా రాణిస్తున్న మంత్రుల్లో అమిత్ షాకే 39 శాతం మంది ఓట్లేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ కు 14 శాతం మంది, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి 10 శాతం మంది మద్దతుగా నిలిచారు.

రామ మందిర నిర్మాణ తీర్పే కేంద్ర ప్రభుత్వపు అతిపెద్ద విజయమని 27 శాతం మంది పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని 20%, కరోనా కట్టడిలో చర్యలపై 15 శాతం, మేకిన్ ఇండియాకు 9%, నల్ల ధనం వెలికితీతకు 8 శాతం మంది ఓట్లేశారు.

నిరుద్యోగం కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమని 29 శాతం మంది చెప్పారు. ధరల పెరుగుదలపై 13 శాతం, నోట్ల రద్దుకు 10%, రైతు నిరసనలు 9%, కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు బాగాలేవని 8 శాతం మంది చెప్పారు.

కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థంగా గాడిలో పెట్టిందని 67 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందులో 20 శాతం మంది ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. మహమ్మారి వల్ల ఆదాయం కోల్పోయామని 66 శాతం మంది చెబితే.. ఉద్యోగాలు కోల్పోయామని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ చెత్త అని 13 శాతం మంది, దానితో ఆర్థిక రంగం బాగా దెబ్బతిన్నదని 10 శాతం మంది చెప్పారు.