పేదవాడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి ఆర్.నారాయణమూర్తి: రేవంత్ రెడ్డి

22-01-2021 Fri 14:56
  • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
  • 'రైతన్న' పేరుతో సినిమా తెరకెక్కించిన నారాయణమూర్తి
  • అభినందించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy lauds film maker R Narayana Murthy

సామాజిక అంశాలే ఇతివృత్తంగా సినిమాలు తీసే టాలీవుడ్ దర్శక నటుడు ఆర్.నారాయణమూర్తి తాజాగా 'రైతన్న' పేరుతో సినిమా తెరకెక్కించారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించారు. మొదట దీనికి 'రైతు బంద్' అని టైటిల్ అనుకున్నా, ఆ తర్వాత 'రైతన్న'గా మార్చారు. ఈ సినిమా ఫిబ్రవరిలో రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి 'రైతన్న' పేరుతో సినిమా తీయడం అభినందనీయం అని కొనియాడారు. పేదవాడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి నారాయణమూర్తి అని అభివర్ణించారు. కేంద్రం నూతనంగా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురాగా, వాటిని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు రైతు సంఘాలకు, కేంద్రానికి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ప్రతిష్టంభన తొలగిపోలేదు.