గూగుల్​ వర్సెస్​ ఆస్ట్రేలియా: సేవలు ఆపేస్తామని గూగుల్​ హెచ్చరిక

22-01-2021 Fri 14:42
  • ప్రతిపాదిత న్యూస్ మీడియా చట్టంపై ఆగ్రహం
  • సంస్థల కంటెంట్ కు డబ్బు చెల్లించకుండా చట్టం అడ్డుకట్ట
  • అమలైతే దేశం నుంచి వెళ్లిపోతామని ప్రకటన
  • పోతే పొండి అంటూ ప్రధాని మోరిసన్ ఘాటు రిప్లై
  • ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని స్పష్టీకరణ
Google takes on Australian govt threatens to pull search engine over unworkable media law

ఆస్ట్రేలియా ప్రభుత్వంతో గూగుల్ ఢీకొడుతోంది. దేశంలో సేవలను ఉపసంహరించుకుంటామని, సెర్చ్ ఇంజన్ ను ఆపేస్తామని హెచ్చరించింది. దీనికి ఆస్ట్రేలియా సర్కార్ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. పోతే పొండి అని తేల్చి చెబుతోంది. ఇంతకీ కంపెనీ, సర్కార్ మధ్య ఇంత గొడవ జరగడానికి కారణమేంటి?

ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం న్యూస్ మీడియా చట్టాన్ని ప్రతిపాదించింది. వార్తలను పబ్లిష్ చేస్తున్నందుకు ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు గూగుల్ నిధులిస్తోంది. ఫేస్ బుక్ కూడా తన పబ్లిషర్లకు డబ్బులు చెల్లిస్తోంది. అయితే, దీనిని నిరోధిస్తూ ఆస్ట్రేలియా సర్కారు ఆ చట్టాన్ని తెచ్చింది. దీనిపైనే గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది మంచి చట్టం కాదని, అదిగానీ అమల్లోకి వస్తే దేశం విడిచి వెళ్లిపోతామని గూగుల్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా హెచ్చరించారు. సేవలు నిలిపేయడం తప్ప తమకు వేరే దారి లేదన్నారు.

అయితే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా దీటుగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. ‘‘మా దేశంలో మీరేం చేయాలో మేం నిర్ణయిస్తాం. నిబంధనలు పెడతాం. అది మా పార్లమెంటు, మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఇక్కడ ఉండాలంటే వాటి ప్రకారమే నడుచుకోవాలి. పోతాం అని బెదిరిస్తే దానికి స్పందించాల్సిన అవసరం మాకు లేదు’’ అని మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

అయితే, ఇవి బెదిరింపులు కావని, నిజమని సిల్వ అన్నారు. ప్రతిపాదిత చట్టంలో ఏముందో పూర్తిగా చదవలేదని, మొత్తం తెలుసుకున్నాక ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఈ కొత్త చట్టం వల్ల డిజిటల్ ఎకానమీపై పెద్ద దెబ్బ పడుతుందని ఆమె అన్నారు.