ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం: నారా లోకేశ్

22-01-2021 Fri 14:26
  • ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై లోకేశ్ స్పందన
  • జీవో 77 రద్దు చేయాలన్న డిమాండ్
  • అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని విమర్శ  
  • టీఎన్ఎస్ఎఫ్ నేతల అరెస్టుకు ఖండన
Lokesh demands withdraw fees reimbursement cancellation for private college PG students

జీవో నెం.77 తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయాలని, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే హక్కు లేదా? అని నిలదీశారు.