కేసీఆర్ కి చేతకావడం లేదు.. వయసు అయిపోయింది: జీవన్ రెడ్డి

22-01-2021 Fri 14:15
  • చేత కాకపోవడం వల్లే కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారు
  • ప్రజల సమస్యలను పరిష్కరించడంపై కేసీఆర్ కు శ్రద్ధ లేదు
  • గిరిజన ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారు
KCR does not have capability to rule the state says Jeevan Reddy

త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

మరోవైపు, కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వయసు అయిపోయిందని... ఆయనకు చేతకావడం లేదని... అందుకే తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ... ప్రజల సమస్యలను పరిష్కరించడంపై లేదని అన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం చాలా బెటర్ అని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వైపు మొగ్గు చూపారని దుయ్యబట్టారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ని అమలు చేయడంలో కూడా రెండేళ్లు ఆలస్యం చేశారని చెప్పారు. గిరిజనుల 10 శాతం రిజర్వేషన్లను కూడా కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. గిరిజన ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారని అన్నారు.