COVID19: వ్యాక్సిన్​ వేసుకోమంటే.. అబద్ధాలు.. డుమ్మాలు.. కొందరు వైద్య సిబ్బంది తీరిది!

Some lie others play truant to escape being vaccinated
  • వేసుకోకున్నా దూదులు అడ్డం పెట్టుకుని కొందరు డాక్టర్ల నాటకాలు
  • 20 ఘటనలు దృష్టికి వచ్చాయన్న బెంగళూరు అధికారి
  • హైదరాబాద్ లో 15% మంది ఆరోగ్య కార్యకర్తలు డ్యూటీకి డుమ్మా
  • లాంగ్ లీవ్ లో కొందరు.. తమ వంతు వచ్చినప్పుడు మరికొందరు
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటేనే చాలా మంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు హడలిపోతున్నారు. వ్యాక్సిన్ ఎక్కడ వేసుకోవాల్సి వస్తుందోనన్న భయంతో డ్యూటీలు డుమ్మాలు కొడుతున్నారు. అబద్ధాలాడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ లలోనే ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

కొందరు డాక్టర్లు వ్యాక్సిన్ వేసుకోకపోయినా వేసుకున్నట్టు నాటకాలు ఆడుతున్నారని బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థకు చెందిన ఓ ఆరోగ్యాధికారి చెప్పారు. 20 ఘటనల దాకా ఇలాంటివి తన దృష్టికి వచ్చాయన్నారు. ‘‘ఓ డాక్టర్ తన నర్సుతో దూది తెప్పించుకుని చెయ్యి మీద పెట్టుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకున్నట్టు నాటకమాడాడు’’ అని చెప్పారు.

హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 10 నుంచి 15 శాతం వరకు ఉద్యోగులు డ్యూటీకి డుమ్మా కొడుతున్నట్టు ఓ వ్యాక్సినేషన్ ఇన్ చార్జ్ చెప్పారు. జనవరి 16న సెలవు పెట్టిన వారు ఇప్పటిదాకా డ్యూటీ ఎక్కలేదని అన్నారు. కొందరు అధికారులు, సిబ్బంది తమ వంతు వచ్చిన రోజే సెలవు పెట్టారన్నారు. చాలా మంది లబ్ధిదారులు వ్యాక్సినేషన్ రోజునే ‘ఎమర్జెన్సీ’ అంటూ ఉన్నట్టుండి సెలవు పెట్టేస్తున్నారని అధికారులు చెప్పారు.

కాగా, వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది. రెండు, మూడో దశల వ్యాక్సినేషన్ కు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అయితే, ఇప్పుడు తొలి దశ వ్యాక్సినేషన్ లోనూ అలాంటి అవగాహన కార్యక్రమాలే నిర్వహించాలని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.
COVID19
Corona Vaccine
Bengaluru
Hyderabad

More Telugu News