అమెరికాలో దిగగానే క్వారంటైన్​.. తప్పనిసరి చేసిన బైడెన్​

22-01-2021 Fri 12:36
  • అధ్యక్షుడిగా తొలి సంతకం కరోనా ఫైల్ పైనే
  • మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందే
  • మెడికల్ షాపుల్లో కరోనా వ్యాక్సిన్
  • స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు
Biden seeks to require international air passengers to quarantine upon US arrival

అమెరికాకు వెళ్లాలనుకునే వారు ఇకపై కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. దేశంలో అడుగుపెట్టాక కచ్చితంగా కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఉత్తర్వులిచ్చారు. గురువారం ఆయన పలు ఫైళ్లపై సంతకం చేశారు. అందులో తొలి సంతకం కరోనా ఫైల్ పైనే పెట్టారు.

మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దని బైడెన్ సూచించారు. వేరే దేశాల నుంచి వచ్చే వారు.. విమానం ఎక్కడానికి ముందే కరోనా టెస్ట్ చేయించుకోవాలని, అమెరికాకు వచ్చాక కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఇప్పటికిప్పుడు కరోనా ఏమీ నియంత్రణలోకి రాదని, దానికి కొన్ని నెలల టైం పడుతుందని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా కరోనాను అంతం చేస్తామన్నారు.

ఇవీ కొత్త ఆదేశాలు..

*  విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి టెస్ట్, క్వారంటైన్.
*  ప్రభుత్వ, అంతర్రాష్ట్ర రవాణా కేంద్రాల్లో మాస్క్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలి.
*  మెడికల్ షాపుల ద్వారా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభం.
*  వ్యాక్సిన్ల సంఖ్య, ఇతర పరికరాల ఉత్పత్తి పెంపునకు రక్షణ ఉత్పాదక చట్టం అమలు.
*  ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్మాణం.
*  మొదటి వంద రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్.
*  సురక్షితంగా స్కూళ్లు, కాలేజీలు, పిల్లల సంరక్షణ కేంద్రాల ప్రారంభానికి మార్గదర్శకాలు.
*  ఉద్యోగులకు మరింత కట్టుదిట్టమైన భద్రతా హక్కులు.
*  టెస్టులను పెంచేందుకు, కరోనా వ్యవహారాలు చూసేందుకు ఓ కొత్త సంస్థ.
*  కరోనాతో కుదేలైన మైనారిటీ వర్గాలకు వనరులు, వసతి కల్పన.