'ఐఏఎస్ బ్యాక్ డోర్ ఎంట్రీ' ఆరోపణలపై లోక్ సభ స్పీకర్ కుమార్తె అంజలి స్పందన

22-01-2021 Fri 11:08
  • తొలి అటెంప్ట్ లోనే సివిల్స్ సాధించిన ఓం బిర్లా కుమార్తె
  • పరీక్షలు రాయకుండానే బ్యాక్ డోర్ ద్వారా సెలెక్ట్ అయ్యారంటూ ప్రచారం
  • తాను ఎంతో కష్టపడి చదివానని చెప్పిన అంజలి బిర్లా
Speaker Om Birlas Daughters Reply To Trolls On IAS Backdoor Entry Charge

పరీక్షలకు హాజరుకాకుండానే సివిల్ సర్వీస్ పరీక్షల్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా పాస్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ట్రోలింగ్ పై అంజలి మాట్లాడుతూ ఇది అవాస్తవమని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ, ఈ వార్తలతో తాను తొలుత దిగ్భ్రాంతికి గురయ్యానని... ఆ తర్వాత తేరుకున్నానని తెలిపారు. ఇలాంటి ట్రోలింగ్ కు వ్యతిరేకంగా చట్టాలు ఉండాలని అన్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈరోజు తాను బాధితురాలినని... రేపు మరొకరు తన మాదిరే బాధితులు అవుతారని అన్నారు.

23 ఏళ్ల అంజలి బిర్లా తొలి అటెంప్ట్ లోనే సివిల్ సర్వీస్ పరీక్షలను క్లియర్ చేసింది. మెరిట్ లిస్ట్ లో ఆమె పేరు ఉంది. అయితే, తన తండ్రి పలుకుబడితో బ్యాక్ డోర్ ద్వారా ఆమె ఈ పరీక్షను క్లియర్ చేసిందనే ప్రచారాన్ని కొందరు చేస్తున్నారు. ఈ ప్రచారంతో తొలుత తాను షాక్ కు గురైనప్పటికీ... ఈ అనుభవం తనను మరింత రాటుదేల్చిందని అంజలి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని తనకు ఇచ్చిందని అన్నారు. సివిల్స్ సాధించడానికి తాను ఎంత కష్టపడి చదివానో తనకు తెలుసని చెప్పారు. తాను ఎంత కష్టపడ్డానో తన సన్నిహితులందరికీ తెలుసని అన్నారు.

సివిల్స్ కొట్టాలంటే ఒక ఏడాది కాలంలో మూడు స్టేజ్ లలో జరిగే పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంజలి చెప్పారు. మూడింటినీ క్లియర్ చేసి మెరిట్ సాధిస్తేనే సివిల్ సర్వెంట్ అవుతారని అన్నారు. యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష చాలా పారదర్శకంగా జరుగుతుందని... బ్యాక్ డోర్ ఎంట్రీలకు ఇక్కడ స్థానం ఉండదని చెప్పారు. అత్యున్నతమైన ఈ వ్యవస్థను కనీసం గౌరవించడమైనా నేర్చుకోవాలని సూచించారు. అంతేకాదు మూడు స్టేజ్ లను తాను క్లియర్ చేసిన డాక్యుమెంట్లను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

సివిల్స్ పరీక్షలకు ఏడాది ముందు నుంచే తాను చదవడం ప్రారంభించానని అంజలి చెప్పారు. ప్రతి రోజు 8 నుంచి 12 గంటల పాటు చదివేదాన్నని తెలిపారు. సివిల్స్ ను క్రాక్ చేయాలంటే ఈ మాత్రం ప్రిపరేషన్ చాలా అవసరమని చెప్పారు. సివిల్ సర్వీసెస్ లో చేరేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకైతే తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని చెప్పారు.