ఆ కన్నడ సినిమాకి, 'సలార్'కి సంబంధం లేదంటున్న దర్శకుడు!

22-01-2021 Fri 10:45
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్'
  • 'ఉగ్రమ్' సినిమాకి రిమేక్ అంటూ వార్తలు
  • ఖండించిన దర్శకుడు ప్రశాంత్ నీల్
  • 'కేజీఎఫ్' టైంలోనే ఈ కథ రాశానన్న ప్రశాంత్    
Prashanth Neil says salar is not remake of Ugram

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగును కూడా హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు.

ఇక ఈ సినిమాపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఏడేళ్ల క్రితం కన్నడలో ప్రశాంత్ రూపొందించిన 'ఉగ్రమ్' చిత్రానికి ఈ సలార్ రీమేక్ అన్నది ఆ వార్త సారాంశం.

ఈ వార్త బాగా ప్రచారమై దర్శకుడు ప్రశాంత్ వద్దకు చేరడంతో ఆయన తాజాగా స్పందించాడు. ఇది ఉగ్రమ్ కు ఎంతమాత్రం రీమేక్ కాదని స్పష్టం చేశాడు. అసలు ఆ చిత్రానికీ, దీనికి పోలిక ఉండదని చెప్పాడు. తాను కేజీఎఫ్ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ కథను రాసుకున్నాననీ, అది ప్రభాస్ కు నచ్చడంతో ఈ ప్రాజక్ట్ ఓకే అయిందనీ ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.

ఇదిలావుంచితే, ఈ 'సలార్' సినిమాలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన విలన్ గా నటిస్తున్నాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే, దర్శకుడు ప్రశాంత్ మరోసారి స్పందించాల్సిందే!