Jagga Reddy: కేసీఆర్ ను జైల్లో పెడతామని అంటాడు.. ఆయన చేసిన తప్పేందో చెప్పడు: బండి సంజయ్ పై జగ్గారెడ్డి విసుర్లు

Bandi Sanjay never reveal about KCR mistakes says Jagga Reddy
  • బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోంది
  • బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల  పంచాయతీ
  • ప్రాంతీయ పార్టీల్లో కొడుకును సీఎంని చేసే సంప్రదాయమే ఉంటుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటుంటాడని... కేసీఆర్ చేసిన తప్పేందో మాత్రం చెప్పడని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోందని చెప్పారు.

అలాగే, ఏ ఆధారంతో కేసీఆర్ ను జైల్లో పెడతారని టీఆర్ఎస్ నాయకులు కూడా అడగరని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయతీ అని విమర్శించారు. అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్ చేస్తుంటారని... రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారని... ఈ పార్టీలది కూడా అదే తీరు అని దుయ్యబట్టారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలపై బండి సంజయ్ మాట్లడటం లేదని... ఇదే విధంగా ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించరని జగ్గారెడ్డి అన్నారు. ఒకరి హామీల గురించి మరొకరు మాట్లాడకూడదనేదే ఈ పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని విమర్శించారు. ఈ మూడు పార్టీలు పగలు కొట్టుకుంటూ, రాత్రి మాట్లాడుకుంటాయని దుయ్యబట్టారు. ప్రజల కోసం పని చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని బండి సంజయ్ తెరపైకి తెచ్చారని... సాధారణ ఎన్నికల సమయానికి ఏ దేవుడిని తీసుకొస్తారో? అని జగ్గారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కొడుకును సీఎంని చేసే సంప్రదాయమే ఉంటుందని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కొడుకుని కాదని అల్లుడిని సీఎంని చేయరని చెప్పారు. తెలంగాణలో జరగబోతున్న సీఎం మార్పు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే జరగబోతోందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేటీఆర్ సీఎం కావడం వల్ల బీజేపీకే ఉపయోగమని... బీజేపీ కొత్త ఆటను ప్రారంభిస్తుందని చెప్పారు.
Jagga Reddy
Congress
Bandi Sanjay
BJP

More Telugu News