వారానికి మూడు రోజుల సెలవు.. చట్టం కోసం బిల్లు పెట్టాలంటూ జపాన్ నేతల డిమాండ్

22-01-2021 Fri 10:21
  • ప్రయోగాత్మకంగా అమలు చేసిన జపాన్
  • మైక్రోసాఫ్ట్‌లో 40 శాతం పెరిగిన ఉత్పాదకత
  • చిన్న సంస్థలకు ఆర్థిక చేయూత యోచన
japan politicians want 3 days weekend

జపాన్‌లో నాలుగు రోజుల పనిదినం, మూడు రోజుల సెలవు దినాల ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు దీనిని చట్టం చేయాలంటూ ఆ దేశ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చట్ట సభలో వెంటనే బిల్లు పెట్టి దీనిని చట్టంగా మార్చాలని కోరుతున్నారు. జపాన్‌లో ఇప్పటికే వారానికి రెండు రోజుల సెలువు దినాల విధానం అమలవుతోంది. అయితే, ఉద్యోగ భద్రతతోపాటు, అదనపు వేతనం కోసం చాలామంది ఉద్యోగులు అదనపు సమయం కూడా పనిచేస్తుంటారు.  అంతేకాదు, చాలాసార్లు ఆఫీసుల్లోనే నిద్రపోతుంటారు కూడా. ఫలితంగా మానసిక సమస్యలు ఎదుర్కోవడంతోపాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు.

దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవు విధానాన్ని తీసుకురావాలని యోచించింది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం అయింది. అయితే, ఈలోపు కొవిడ్ రావడం, వర్క్ ఫ్రమ్ హోం విధానం పెరగడంతో నేతలు మళ్లీ ఈ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

జపాన్‌లోని మైక్రోసాఫ్ట్ ఆగస్టు 2019లో మూడు రోజుల సెలవు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి అద్భుత విజయం సాధించింది. ఈ విధానంలో ఉత్పాదకత 40 శాతం పెరిగినట్టు గుర్తించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే కనుక చిన్న సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.