రైతుల ఆందోళనలతో రూ. 50 వేల కోట్ల నష్టం: సీఏఐటీ అంచనా
- దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళన
- ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరిస్తే మేలు
- లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఆందోళన కారణంగా ఇప్పటి వరకు వాణిజ్యం పరంగా రూ. 50 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. రైతు సంఘాలతో మొన్న ప్రభుత్వం జరిపిన పదో విడత చర్చల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించింది.
వ్యవసాయ చట్టాలను 18 నెలలపాటు నిలిపివేస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన కొంత ప్రయోజనకరంగా ఉంటుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. రైతుల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ ప్రతిపాదనకు రైతు సంఘాలు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఒకవేళ ఈ ప్రతిపాదనకు అంగీకరించకుంటే సమస్య పరిష్కారానికి రైతులు ఆసక్తి చూపడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, అంతేకాకుండా విభజన శక్తులు మరిన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదిత కమిటీలో వ్యాపార సంఘాలకు కూడా స్థానం కల్పించాలని సీఏఐటీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనపై రేపు జరగబోయే భేటీలో రైతులు తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం ఉంది.



























