‘కేరింత’ నటుడు విశ్వంత్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు

22-01-2021 Fri 08:42
  • తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానని మోసం
  • విశ్వంత్‌తోపాటు ఆయన తండ్రి, మరొకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • 41ఎ కింద నోటీసులు
Banjara Hills police sent notice to Telugu Jersey actor Viswant

అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ నటుడు విశ్వంత్‌ దుద్దుంపూడికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు పంపారు. తనకు తక్కువ ధరకే ఖరీదైన కారు ఇప్పిస్తానని మోసం చేశాడన్న బాధితుడి ఫిర్యాదుపై విశ్వంత్‌, ఆయన తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా, స్పేస్ టైమ్ ఇంటీరియర్ నిర్వాహకుడు ఆత్మకూరి ఆకాశ్‌గౌడ్‌లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నటుడు విశ్వంత్‌కు 41ఎ సీఆర్‌పీసీ కింద బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు  జారీ చేశారు.  
 
విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్. సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. 2015లో దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు.