నితీశ్‌ను చూడండి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్య నిషేధం విధించండి: నడ్డాను కోరిన ఉమాభారతి

22-01-2021 Fri 08:09
  • మధ్యప్రదేశ్‌లో మద్యం దుకాణాల పెంపు ప్రతిపాదనపై దుమారం
  • నితీశ్ కుమార్ వరుస విజయాలకు కారణం మద్య  నిషేధమేనన్న సీనియర్ నేత
  • ఇతర మార్గాల ద్వారా పోయిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని సూచన 
  • ఉమాభారతి వరుస ట్వీట్లు
Impose liquor ban in all BJP ruled states

మధ్యప్రదేశ్‌లో మద్యం దుకాణాల పెంపు ప్రతిపాదన వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కీలక ప్రతిపాదన చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ మద్య నిషేధం విధించాలని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు 8 వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా బీహార్‌లో మద్య నిషేధం అమలును ప్రస్తావించారు. నితీశ్ కుమార్ వరుస విజయాల వెనక మద్య నిషేధం ఉందని, ఈ కారణంతో మహిళలు ఆయన వెనక నిలిచారని అన్నారు.  

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యమే కారణమని ఉమా భారతి అన్నారు. మద్య నిషేధం కారణంగా కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పూడ్చుకోవచ్చని అన్నారు. దుకాణాల పెంపుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఈ సందర్భంగా ఉమాభారతి ప్రశంసించారు.