తిరుపతి బరిలో జనసేన నిలిస్తే.. నేనే ప్రచారం చేస్తా: పవన్ కల్యాణ్

22-01-2021 Fri 07:19
  • నాయకులు, కార్యకర్తలతో పవన్ భేటీ
  • పార్టీ అభ్యర్థిపై వచ్చే వారం నిర్ణయం
  • మతం పేరిట రాజకీయాలు జనసేన నైజం కాదన్న జనసేనాని
next week will decide jana sena candidate for tirupati by poll

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో కనుక జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో నిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. ఒకవేళ జనసేన కాకుండా బీజేపీ నిలిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు బలంగా పోటీ చేయాలని కోరారు.

మతం పేరిట రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను రామతీర్థం వెళ్లలేదని పవన్ చెప్పారు. మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధిని వదులుకుంటానని స్పష్టం చేశారు. మత ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతమన్నారు. కాగా, తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి షెడ్యూలు విడుదల కాలేదు.