ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన బాగ్దాద్.. 32 మంది మృతి

22-01-2021 Fri 06:50
  • రద్దీ మార్కెట్లో జంట పేలుళ్లు
  • మరో 73 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Twin Suicide Attack in Crowded Market In Baghdad Kills 32

ఆత్మాహుతి దాడులతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ దద్దరిల్లింది. రద్దీ మార్కెట్లో ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 32 మంది చనిపోగా, 73 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాజధానిలోని బాబ్ అల్ షార్కీ ప్రాంతం వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. నిన్న ఉదయం ఓ ఉగ్రవాది అక్కడికి వచ్చాడు. మరణాల సంఖ్యను పెంచే ఉద్దేశంతో అస్వస్థతకు గురైనట్టు నటించాడు. ఏం జరిగిందోనని జనాలు గుమిగూడగానే తనను తాను పేల్చేసుకున్నాడు.  ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతం మాంసం ముద్దలా మారింది. తెగిపడిన శరీరాలు, అవయవాలు చెల్లాచెదరుగా పడ్డాయి. జనం భయంతో పరుగులు తీశారు.

ఈ క్రమంలో కొందరు సహాయక కార్యక్రమాలు ప్రారంభించగానే మరో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయనప్పటికీ, ఇది ఐసిస్ పనేనని అనుమానిస్తున్నారు.

క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు తరుముతున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు మిలటరీ ప్రతినిధి తెలిపారు. 2018లో ఇదే ప్రాంతంలో జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.