'రాధేశ్యామ్'లో కీలక పాత్ర పోషించిన కృష్ణంరాజు

21-01-2021 Thu 21:34
  • ప్రభాస్ తో కలసి మరోసారి నటించిన కృష్ణంరాజు 
  • మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషణ
  • తన షూటింగ్ పూర్తయిందన్న రెబల్ స్టార్  
Krishnam Raju acted to gether with Prabhas in Radhe Shyam

నాటి రెబల్ స్టార్ కృష్ణంరాజు.. నేటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలసి నటిస్తే ఇక అభిమానులకు పండగే కదా.. ఈ ముచ్చట మరోసారి తీరనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించారు.

తన పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో రాధే శ్యామ్ సినిమాలో తాను నటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పాత్ర పోషణ కోసం ఇటీవల తాను గడ్డం పెంచానని కూడా వెల్లడించారు. ఇక తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని కృష్ణంరాజు తెలియజేశారు.

పాన్ ఇండియా సినిమాగా నిర్మాణం జరుపుకుంటున్న 'రాధే శ్యామ్' పారిస్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. వచ్చే వేసవిలో దీనిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.