'సీరం' అగ్నిప్రమాదంపై వివరణ ఇచ్చిన అదార్ పూనావాలా

21-01-2021 Thu 17:17
  • పూణేలోని సీరం సంస్థలో అగ్నిప్రమాదం
  • ఎవరికీ ప్రాణాపాయం లేదన్న సీరం అధినేత పూనావాలా
  • అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్న వైనం
  • వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదన్న సీరం వర్గాలు
Adar Punawala responds on fire accident in SII Pune

పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై సీరం సంస్థ అధినేత అదార్ పూనావాలా స్పందించారు. తమ సంస్థలో అగ్నిప్రమాదం జరగడం పట్ల స్పందించిన వారికి, ప్రార్థించినవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అనేక అంతస్తులు ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైనా ఎవరికీ ప్రాణహాని కలగలేదని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు.

ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం సంస్థే ఉత్పత్తి చేస్తోంది. వ్యాక్సిన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లోనే అగ్నిప్రమాదం జరిగింది. ఈ మధ్యాహ్నం సీరం సంస్థలోని సెజ్-3 భవనంలోని 4, 5వ అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించాయి. అయితే, అగ్నిప్రమాదం కారణంగా వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అవాంతరాలు కలగలేదని సీరం వర్గాలు తెలిపాయి.