ఇదంతా కేసీఆర్ ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా ఉంది: విజయశాంతి

21-01-2021 Thu 14:49
  • కేటీఆర్ కాబోయే సీఎం అని మంత్రులు సంకేతాలిస్తున్నారు
  • కేసీఆర్ గోదావరికి పూజలు చేయడం అనుమానాలకు తావిస్తోంది
  • తనను కనికరించిన ప్రాజెక్టులను కేసీఆర్ పర్యటిస్తున్నారు
Vijayashanthi fires on KCR

కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ మంత్రులు సంకేతాలిస్తున్నారని... ఈ తరుణంలో కేసీఆర్ ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి, గోదావరికి హారతులిచ్చి పూజలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఆకాశానికెత్తేస్తున్నారని... ఇన్నాళ్లు కమిషన్ల రూపంలోనో, మరో రూపంలోనో తనను కనికరించిన ప్రాజెక్టులను పర్యటిస్తున్నారని విజయశాంతి దెప్పిపొడిచారు. ఈ పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తుంటే కొడుక్కి సీఎం పీఠాన్ని అప్పగించి, తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాపపరిహారంగా నదీమతల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు కేసీఆర్ తీరు కనిపిస్తోందని సెటైర్ వేశారు. ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులను కలుసుకునే సమయమే కేసీఆర్ కు లేదని విమర్శించారు.