శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు: నటి రాగిణి ద్వివేదికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు

21-01-2021 Thu 13:19
  • నాలుగు నెలల కిందట కర్ణాటకలో డ్రగ్స్ కలకలం
  • రాగిణి, సంజన అరెస్ట్
  • నవంబరులో రాగిణికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు
  • సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాగిణి
  • ఊరటనిచ్చే తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
Supreme Court grants bail for Kannada actress Ragini Dwivedi

కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నటి రాగిణి ద్వివేది (30) అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే, నాలుగు నెలల తర్వాత రాగిణికి ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

గతేడాది వెలుగుచూసిన డ్రగ్స్ స్కాంలో నటి రాగిణితో పాటు మరో హీరోయిన్ సంజన గల్రానీని కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని, రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, డ్రగ్స్ కలిగి ఉన్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి.

అరెస్ట్ తర్వాత రాగిణి కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, నవంబరు 3న జరిగిన విచారణలో చుక్కెదురైంది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం నటికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేశారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

కాగా, వాదనల సందర్భంగా రాగిణి ద్వివేది న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ... తన క్లయింటు నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లేవని, కొంతమొత్తంలో పొగాకు మాత్రమే ఉందని కోర్టుకు తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, రాగిణికి బెయిల్ ఇవ్వొద్దని, హోటళ్లు, ఫాంహౌస్ ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తోందని ఆరోపించారు. అదే నిజమైతే తన క్లయింటు డ్రగ్స్ కలిగి ఉందనేందుకు ఆధారాలు చూపించాలని రాగిణి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అన్యాయంగా ఆమెను 140 రోజులు జైల్లో ఉంచారని కోర్టుకు తెలిపారు. కోర్టు రాగిణి తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది.