నిందితులను పట్టుకోవడం చేతకాక.. ఇలాంటి పనులా?: కళా వెంకటరావు అరెస్ట్‌పై లోకేశ్ ఫైర్

20-01-2021 Wed 22:02
  • రాముడి తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేని చేతకాని సర్కారు
  • అధికారం అండతో ఇంకెంత మందిని అరెస్ట్ చేస్తారు
  • కళా వెంకటరావు సౌమ్యుడు
nara lokesh responds on kala venkata rao arrest

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్ట్‌ను టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. రామతీర్థం ఘటనలో కొద్దిసేపటి క్రితం విజయనగరం జిల్లా రాజాంలో కళా వెంకటరావును నెల్లిమర్ల పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కళా అరెస్ట్‌పై మండిపడిన లోకేశ్.. రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు సౌమ్యుడైన కళా వెంకటరావును అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో ఇంకెంతమంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థంలో పర్యటించిన సమయంలో అక్కడికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కళాపైనా కేసు పెట్టారు. ఇందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అరెస్ట్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు ఆయన ఇంటికి భారీగా చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.