టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్.. రాజాంలో ఉద్రిక్తత

20-01-2021 Wed 21:48
  • విజయసాయి వాహనంపై చెప్పుల దాడి కేసులో అరెస్ట్
  • కళా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • విడుదల చేయాలంటూ కార్యకర్తల డిమాండ్
tdp leader kala venkata rao arrested in rajam

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన నెల్లిమర్ల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు ముందు కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థంలో పర్యటించిన సమయంలో అక్కడికే వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి జరిగింది.

ఈ ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కళాపైనా కేసు పెట్టారు. ఇందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అరెస్ట్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. పోలీసుల చర్యను ఖండించారు. కళా వెంకట్రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అరెస్ట్ చేసిన కళాను ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించినదీ తెలియరాలేదు.