తమిళనాడు గవర్నర్‌గా వెళుతున్నారా? అన్న ప్రశ్నకు కృష్ణంరాజు సమాధానం ఇదే!

20-01-2021 Wed 19:00
  • కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు
  • నన్ను సంప్రదించకుండానే అందరూ రాసేశారు
  • ఇలాంటి వార్తలు నాకు నచ్చవు
  • ప్రధానిపై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ 
  • ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు చమత్కారంగా సమాధానం 
BJP leader Krishnam Raju clarifies about Tamil Nadu Governor post

తాను తమిళనాడు గవర్నర్‌గా వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, నటుడు కృష్ణంరాజు స్పందించారు. ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తనను తమిళనాడు గవర్నర్‌గా పంపిస్తున్నట్టు అన్ని చానళ్లలోనూ వార్త వచ్చిందని, అందరూ రాశారని అన్నారు. కానీ రాసే ముందు కానీ, ఆ తర్వాత కానీ ఎవరూ తనను సంప్రదించలేదని అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

తనకు గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని అందరి కోరిక అని, ఇస్తే బాగుంటుందని అందరూ అనుకోవడం వల్లే ఇలాంటి వార్త వచ్చి ఉండొచ్చని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. నిజానికి ఇలాంటి వార్తలు తనకు నచ్చవని అన్నారు. వచ్చాక వచ్చిందని చెప్పుకోవడం బాగుంటుంది కానీ, రాకుండానే ప్రచారం చేసుకోవడం సరికాదని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. ఆయనలాంటి ప్రధాని తమకూ కావాలని ఇతర దేశాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ వెనకబడిందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తోందన్నారు. తాను బీజేపీలో చేరిన తర్వాతే కమలంపువ్వు పార్టీ ఒకటి ఉందని రాష్ట్రంలో తెలిసిందని, ఆ తర్వాత బీజేపీ ఎంపీల సంఖ్య నాలుగుకు పెరిగిందని గుర్తు చేసుకున్నారు.

నాటి నుంచి నేటి వరకు పార్టీ దినదిన ప్రవర్థమానం చెందుతోందన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుందని కృష్ణంరాజు చెప్పారు. తాను రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన సలహాలు, సూచనలను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఎప్పటికప్పుడు మెయిల్స్ ద్వారా పంపిస్తుంటానని కృష్ణంరాజు తెలిపారు. చివరిగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు.. అయినప్పుడు అంటూ చమత్కరించారు.