నిర్మల్‌లో కరోనా టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి.. ప్రభుత్వం వివరణ
- నిన్న 11.30 గంటల సమయంలో టీకా తీసుకున్న హెల్త్ వర్కర్
- తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందంటూ ఫిర్యాదు
- ఆసుపత్రికి తరలించేలోపే మృతి
- టీకాకు, మరణానికి సంబంధం లేదన్న ప్రభుత్వం

నిర్మల్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త మృతిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆయన కరోనా టీకా వల్ల చనిపోలేదని, ఆయన మృతికి అది కారణం కాదని స్పష్టం చేసింది. గుండె నొప్పితోనే ఆయన మృతి చెందినట్టు తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో జిల్లాలోని కుంటాల పీహెచ్‌సీలో ఆరోగ్య కార్యకర్త టీకా వేయించుకున్నాడు. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తనకు గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో 5.30 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
అయితే, ఆయన మృతికి వ్యాక్సిన్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయన మృతదేహానికి వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ ఘటనపై జిల్లా ఏఈఎఫ్ఐ దర్యాప్తు జరిపి రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పిస్తుంది. పరిశీలన అనంతరం కేంద్ర ఏఈఎఫ్ఐ కమిటీకి నివేదిస్తుంది.





























