గుడివాడ ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రియురాలి అరెస్ట్

20-01-2021 Wed 17:49
  • సోమవారం అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విజయ్‌కుమార్
  • ప్రియురాలు సురేఖే కారణమంటూ ఎస్సై సోదరుడి ఫిర్యాదు
  • విచారణ అనంతరం అరెస్ట్
Gudivada SI Vijay Kumar Lover arrested

కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ కేసులో ఆయన ప్రియురాలు సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఆపై వైద్య పరీక్షలు చేయించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. తన సోదరుడు విజయ్ కుమార్ ఆత్మహత్యకు సురేఖే కారణమని ఆయన తమ్ముడు విక్రమ్ ఫిర్యాదు మేరకు సురేఖను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి విజయ్ కుమార్ కొన్ని నెలల క్రితం గుడివాడ టూటౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. స్టేషన్‌కు సమీపంలోనే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆయనకు గతేడాది నవంబరులో వివాహమైంది. అయినప్పటికీ భార్యను తీసుకురాకుండా సురేఖతో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సోదరుడు విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా సురేఖను అరెస్ట్ చేశారు.