విజయసాయి, బుద్ధా వెంకన్నల మధ్య ట్వీట్ల వార్

20-01-2021 Wed 17:16
  • పచ్చ పార్టీ నీచానికి తెగబడుతోందన్న విజయసాయిరెడ్డి
  • లూటీ చేసిన వారే దొంగ దొంగ అని అరుస్తారని వ్యాఖ్య
  • బాత్ రూమ్ లో వేసేసిన వాళ్లే గుండెపోటు అని గగ్గోలు పెడతారన్న వెంకన్న
Vijayasai Reddy vs Budda Venkanna

ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్నలు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం పచ్చ పార్టీ నీచానికి తెగబడుతోందని విజయసాయి టీడీపీపై మండిపడ్డారు. టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదహరణ అని చెప్పారు.

విగ్రహాల ధ్వంసం వెనకున్నవారెవరో చెప్పడానికి ఇది చాలని అన్నారు. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలపై చంద్రన్న, అచ్చెన్న ఏమంటారని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని డెకాయిట్ల మాదిరి లూటీ చేసిన వారే 'దొంగ దొంగ' అని అరుస్తారని అన్నారు. గుళ్లు కూల్చిన వారే అపచారం అంటూ అరుస్తారని, బాబు మార్క్ బ్యాంకరెప్ట్ పాలిటిక్స్ ఇలాగే వుంటాయని విజయసాయి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు బుద్ధా వెంకన్న తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాత్ రూమ్ లో వేసేసిన వాళ్లే గుండెపోటు అని గగ్గోలు పెడతారని అన్నారు. రాష్ట్రాన్ని దోచిన దండుపాళ్యం బ్యాచ్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని లెక్చర్లు దంచుతారని ఎద్దేవా చేశారు. విగ్రహాలు కూల్చమని కాంట్రాక్టులు ఇచ్చిన కేటుగాళ్లే పంచకట్టి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్టు కటింగ్ ఇస్తారని చెప్పారు. జగన్ మార్క్ కన్నింగ్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయని దుయ్యబట్టారు.