చెన్నై సూపర్ కింగ్స్ కి హర్భజన్​ బైబై

20-01-2021 Wed 13:35
  • బంధం ముగిసిందని టర్బొనేటర్ ప్రకటన
  • రెండేళ్ల ఒప్పందం పూర్తయిందని వెల్లడి
  • గొప్ప స్నేహితులను పొందానని వ్యాఖ్య
My contract with Chennai Super Kings ends confirms Harbhajan Singh

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)కు టర్బొనేటర్ హర్భజన్ సింగ్ బైబై చెప్పేశాడు. ఇక, ఆ టీమ్ తో తన బంధం ముగిసిందని పేర్కొన్నాడు. బుధవారం ట్విట్టర్ లో చెన్నైతో తన ఒప్పందం పూర్తయిపోయిందని వెల్లడించాడు.

‘‘చెన్నైతో నా ఒప్పందం పూర్తయింది. ఆ టీమ్ తో ఆడడం గొప్ప అనుభవం. ఎన్నెన్నో అందమైన జ్ఞాపకాలను నా సొంతం చేసుకున్నా. ఎన్నోఏళ్ల పాటు గుర్తుంచుకునే గొప్ప స్నేహితులను చెన్నై టీం అందించింది. రెండేళ్ల పాటు నాకు అండగా నిలిచిన సీఎస్ కే యాజమాన్యానికి, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2018 నుంచి 2020 వరకు చెన్నై తరఫున భజ్జీ బరిలోకి దిగాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2018 వేలంలో హర్భజన్ ను సీఎస్ కే దక్కించుకుంది. రూ.2 కోట్లకు అతడితో ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 160 మ్యాచ్ లు ఆడిన అతడు.. 150 వికెట్లు తీశాడు. 7.05 సగటుతో బౌలింగ్ చేశాడు. 137.22 స్ట్రైక్ రేట్ తో 829 పరుగులు చేశాడు.