అన్నాడీఎంకేని మరోసారి గెలిపించండి: తమిళనాడు ప్రజలకు సుమన్‌ విజ్ఞప్తి

20-01-2021 Wed 13:12
  • జయలలిత పథకాలను ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి
  • రాష్ట్ర అభివృద్ధికి పళనిస్వామి కృషి చేస్తున్నారు
  • అన్నాడీఎంకేకి నేను సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నా
Suman supports AIADMK

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టిని సారించాయి. మరోవైపు సినీ తారలు కూడా ఏదో ఒక పార్టీకి మద్దతు పలుకుతూ ఎన్నికల పర్వానికి గ్లామర్ అద్దుతున్నారు. ప్రముఖ నటుడు సుమన్ కూడా అన్నాడీఎంకేకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.

దివంగత జయలలిత ప్రారంభించిన అనేక పథకాలను ప్రస్తుతం పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ఆమె అమలు చేసిన పథకాలే ఆమెను రెండో సారి ముఖ్యమంత్రిని చేశాయని తెలిపారు. ఆ పథకాలను కొనసాగిస్తూ, తమిళనాడు అభివృద్ధికి పళనిస్వామి అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. సినీ రంగంలోకి ప్రవేశించి 43 ఏళ్లు నిండిన సందర్భంగా మధుర మీనాక్షి అమ్మవారిని సుమన్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

సీఎం పదవి అనేది దేవుడిచ్చిన వరమని... అందరికీ ఆ భాగ్యం దక్కదని సుమన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ అన్నాడీఎంకేకు మద్దతుగా నిలవాలని, మరోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు. తన మద్దతు అన్నాడీఎంకేకు సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. అయితే, ఆ పార్టీలో చేరే అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.