హ్యాపీగా లేకుంటే బాస్​ కు చెప్పేస్తుంది.. సరికొత్త రిస్ట్​ బ్యాండ్​ ‘మూడ్​ బీమ్​’!

20-01-2021 Wed 12:37
  • బ్రిటన్ సంస్థ సరికొత్త ఆవిష్కరణ
  • యాప్, వెబ్ సైట్ తో అనుసంధానం
  • ఉద్యోగుల మంచీచెడులు తెలుసుకునేందుకు సంస్థల ఆరాటం
  • వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగుల్లో మానసిక ఆందోళన
A wristband that tells your boss if you are unhappy

స్టైల్ కావొచ్చు.. ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకోవచ్చు.. కారణం ఏదైతేనేం.. ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల రిస్ట్ బ్యాండ్ (మణికట్టు స్మార్ట్ డిజిటల్ గడియారాలు)లు దొరికేస్తున్నాయి. మనం ఎన్ని అడుగులు వేశాం.. ఎంత దూరం నడిచాం? గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోంది? ఒంట్లో ఆక్సిజన్ స్థాయి ఎలా ఉంది? వంటి వివరాలన్నీ మణికట్టు మీదే వాలిపోతున్నాయి. ఓకే అంతా బాగానే ఉంది గానీ.. మరి, మనం ఆనందంగా ఉన్నామో లేదో చెప్పే బ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా!

అలాంటి ఓ బ్యాండ్ నే తీసుకొచ్చింది మూడ్ బీమ్ అనే సంస్థ. దీనికో ప్రత్యేకత కూడా ఉంది. మన ఆరోగ్యం ఎలా ఉందో ఇది చూసుకోదు.. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని మాత్రం చెప్పేందుకే ఈ రిస్ట్ బ్యాండ్. అది కూడా ఉద్యోగులకేనండోయ్. కరోనాతో ఇంకా చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే ట్రెండ్.

అయితే, ఇంటి నుంచి పనిచేసే క్రమంలో చాలా మంది ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నట్టు చాలా సంస్థలు భావిస్తున్నాయి. అందుకే వాళ్లు హ్యాపీగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ఈ బ్యాండ్స్ బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఈ బ్యాండ్ కు పసుపు, నీలి రంగుల్లో రెండు బటన్లుంటాయి. సంతోషంగా ఉంటే పసుపు, బాధలో ఉంటే నీలి రంగు బటన్ ను నొక్కాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ ను మొబైల్ ఫోన్ యాప్, వెబ్ సైట్ తో అనుసంధానిస్తారు. సదరు ఉద్యోగి ఏ బటన్ నొక్కినా ఆఫీసులో మేనేజర్ లేదా ఉన్నత స్థాయి అధికారికి తెలిసిపోతుంది. ఇప్పటికే బ్రిటన్ లోని కొన్ని సంస్థలు ఈ మూడ్ బీమ్ రిస్ట్ బ్యాండ్ ను తమ ఉద్యోగులకు ఇస్తున్నాయి.

అయితే, దానిని పెట్టుకోవాలా? వద్దా? అన్నది ఉద్యోగి ఇష్టానికే సంస్థలు వదిలేస్తున్నాయి. ఈ రిస్ట్ బ్యాండ్ వల్ల ఉద్యోగి మంచి చెడులు ముందే తెలుసుకోవడానికి వీలవుతుందని, దాని వల్ల సంస్థల ఉత్పదాకత కూడా పెరుగుతుందన్న భావన వినిపిస్తోంది.