బ్రిస్బేన్ మైదానంలో 'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదించిన ఆస్ట్రేలియా అభిమాని.. వీడియో వైరల్

20-01-2021 Wed 12:32
  • నిన్న బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
  • మొన్న ఆస్ట్రేలియా అభిమాని నినాదాలు
  • వందేమాత‌రం నినాదం కూడా
  • భార‌త అభిమానులను ఉత్సాహపరిచిన వైనం
Australian Fan Chanting Bharat Mata Ki Jai During Indias Big Win At Gabba

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి, సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారత జ‌ట్టుపై ఆస్ట్రేలియా అభిమానులు సైతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మైదానంలో అయితే ఓ ఆస్ట్రేలియా అభిమాని భారత్‌ మాతా కీ జై, వందేమాతరం నినాదాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతోంది. చివ‌రి టెస్టు నాలుగో రోజు మైదానంలో ఆట కొన‌సాగుతోన్న స‌మ‌యంలో ఆస్ట్రేలియా యువ‌కుడు ఈ నినాదాలు చేశాడు. భారత్‌ మాతా కీ జై, వందేమాతరం నినాదాలు తను చేయ‌డ‌మే కాకుండా అక్క‌డున్న భారత అభిమానుల‌తో కూడా చేయించాడు.

భార‌త్ మాతాకీ జై అని అత‌డు నిన‌దిస్తుంటే అక్క‌డున్న వారంతా జై అని నినాదాలు చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజే అంటే నిన్న టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. సీనియ‌ర్లు లేక‌పోయినా, జ‌ట్టులో ఇత‌ర స‌భ్యులు గాయాల బారిన ప‌డినా టీమిండియా కుర్రాళ్లు భార‌త్ ను గెలుపు తీరానికి చేర్చి, అద్భుత విజయం అందించారు. టీమిండియా కుర్రాళ్లు ఆస్ట్రేలియా అభిమానుల‌నూ అల‌రించారంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. అప్ప‌ట్లో రెండో మ్యాచ్ జరుగుతోన్న సమయంలోనూ ఓ న్యూజిలాండ్ అభిమాని కూడా 'భారత్‌ మాతా కీ జై' అంటూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్ప‌ట్లో ఆ వీడియో కూడా వైర‌ల్ అయింది.