నందిగ్రామ్​ లో దీదీతో సువేందు ఢీ!

20-01-2021 Wed 12:16
  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ టికెట్
  • ధ్రువీకరించిన పార్టీ అత్యున్నత స్థాయి వర్గాలు
  • సువేందునే కరెక్ట్ అన్న బీజేపీ బెంగాల్ చీఫ్
BJP will field Suvendu Adhikari from Nandigram in high voltage contest against Mamata

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ఢీకొట్టేందుకు సువేందు అధికారి సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి సువేందును బీజేపీ బరిలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ధైర్యం ఉంటే నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని మమతకు సువేందు సవాల్ విసరడం, ఆమె ఆ సవాల్ ను స్వీకరించడంతో నందిగ్రామ్ టికెట్ ఆయనకే ఇచ్చారని బీజేపీ అత్యున్నత స్థాయి నేతలు చెబుతున్నారు.

నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సువేందునే సరైన వ్యక్తి అని బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే, తాను రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతానని మమత ఇంతకుముందు ప్రకటించారు. భవానీపూర్, నందిగ్రామ్ లలో పోటీ చేస్తానన్నారు. నందిగ్రామ్ అక్క అయితే.. భవానీపూర్ చెల్లెలు అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ భవానీపూర్ నుంచి తాను పోటీ చేయకపోతే అక్కడా ఓ గట్టి అభ్యర్థినే నిలబెడతానని అన్నారు.