ఏపీ ప్రభుత్వం తప్పకుండా అప్పీల్ చేయాల్సిన కేస్ ఇది: ఐవైఆర్ కృష్ణారావు

20-01-2021 Wed 10:40
  • గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం రహస్యంగానే సాగింది
  • అయితే, అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదని హైకోర్టు తెలిపింది
  • ఈ కోర్టు తీర్పు ఒక్క అమరావతి అంశానికే పరిమితం కాదు
iyr on high court verdict

అమ‌రావ‌తిలో కొంద‌రు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు నిన్న కొట్టేసిందంటూ ఈనాడు దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఏపీ ప్ర‌భుత్వం మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్ర‌స్తావిస్తూ త‌న అభిప్రాయాల‌ను తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ అన్నది స్టాక్‌ మార్కెట్‌లో సెక్యూరిటీలు, బాండ్ల క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారమని కోర్టు తెలిపిన విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

'ప్రభుత్వం తప్పకుండా అప్పీల్ చేయాల్సిన కేస్ ఇది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే రాజధాని కృష్ణాతీరంలో ఉంటుంది అన్నారు కాబట్టి దీనిలో రహస్యం ఏమీ లేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది సరి కాకపోవచ్చు.  ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే రాజధాని వస్తుంది అనే సమాచారం ఆ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అందుచేత తుది నిర్ణయం తీసుకున్న దాకా రాజధాని అంశం రహస్యంగానే సాగింది'  అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.

'సెక్యూరిటీలు, షేర్ల విషయంలో ఉండే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఈ అంశాలకు వర్తించదు. ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన రహస్య సమాచారంతో లబ్ధి పొందటమే నేరంగా భావించినప్పుడు, ప్రభుత్వంలోని రహస్య సమాచారంతో లబ్ధి పొందటం అంతకు మించిన నేరం అవుతుంది. ఈనాడు ఈ కోర్టు తీర్పు ఒక్క అమరావతి అంశానికే పరిమితం కాదు'  అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.

'రేపు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా రహస్య సమాచారం ఉన్న ఏ అధికారి అయినా చుట్టుపక్కల భూములు కారుచౌకగా కొని ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్ముకున్నా ఈ తీర్పు ప్రకారం చట్టరీత్యా నేరం కాదు. దాని పరిణామాలు పాలనా వ్యవస్థపై విపరీతంగా ఉంటాయి' అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.