హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నట్టు జగన్ బ్రహ్మాండంగా నటిస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన

20-01-2021 Wed 09:21
  • 150 ఆలయాలపై దాడులు జరిగితే విచారణ ఏదీ?
  • ప్రతిపక్షాలపైకి తప్పును నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు
  • జగన్ కాళ్లు పట్టుకుని వెల్లంపల్లి తన పదవిని కాపాడుకుంటున్నారు
  • భక్తులు ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించడం ఇక్కడే చూస్తున్నాం
TDP MLC Manthena attacks on ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ మండిపడ్డారు. హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నట్టు ప్రజల ముందు జగన్ బ్రహ్మాండంగా నటిస్తున్నారని విమర్శించారు. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న నిందితులను పట్టుకోవడం చేతకాని జగన్, మంత్రులు ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలోని 150 ఆలయాలపై దాడులు జరిగినా విచారణకు ఆదేశించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల కంటే ముందే ప్రతిపక్షాలపైకి తప్పును నెట్టేసి తప్పించుకోవాలని జగన్ చూస్తున్నారని మంతెన దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ తన డ్రామాలు కట్టిపెడితే మంచిదని హితవు పలికారు. కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి పంపి భక్తులను అవమానించారన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను తిరస్కరించడాన్ని ఇక్కడే చూస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడం చేతకాని మంత్రి వెల్లంపల్లి తన పదవిని కాపాడుకునేందుకు జగన్ కాళ్లు పట్టుకుంటున్నారని, తన వ్యవహార శైలితో దేవాదాయ శాఖను అపవిత్రం చేశారని మంతెన సత్యనారాయణ మండిపడ్డారు.