పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి నివాసం, విద్యాసంస్థల్లో సీఐడీ అధికారుల తనిఖీలు

19-01-2021 Tue 21:18
  • బ్రహ్మానందపురంలో సీఐడీ అధికారుల సోదాలు
  • సోదాల్లో పాల్గొన్న ఎనిమిది మంది అధికారులు
  • పాస్టర్ మతమార్పిడి చేసిన గ్రామాలను పరిశీలిస్తామన్న ఎస్పీ
  • విగ్రహాలు ధ్వంసం చేసినట్టు చెప్పాడని వెల్లడి
CID searches in Pastor praveen Chakravarthy house and educational institutions

ఇటీవల అరెస్ట్ అయిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి చెందిన విద్యాసంస్థల్లో సీఐడీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో 8 మంది సీఐడీ అధికారులతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. దీనిపై సీఐడీ ఎస్పీ రాధిక మాట్లాడుతూ, బ్రహ్మానందపురంలో పాస్టర్ ప్రవీణ్ ఇంటిని కూడా తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ప్రవీణ్ మతమార్పిడి చేశారన్న గ్రామాలను కూడా సందర్శిస్తామని తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రవీణ్ చక్రవర్తి కార్యకలాపాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

విగ్రహాలు ధ్వంసం చేశానని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పాడని స్పష్టం చేశారు. విగ్రహాలను ఎప్పుడు, ఎలా ధ్వంసం చేశాడన్న దానిపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. తమ దర్యాప్తులో కొన్ని ఆధారాలు దొరికాయని సీఐడీ ఎస్పీ రాధిక తెలిపారు. విగ్రహాలపై ప్రవీణ్ మాట్లాడిన వీడియోపై సీఐడీ సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైందని చెప్పారు.