అనసూయకు పవన్ సినిమా నుంచి ఆఫర్?

19-01-2021 Tue 21:06
  • సినిమాలలో బిజీ అయిన యాంకర్ అనసూయ 
  • గతంలో పవన్ సినిమాలో చేయలేకపోయిన వైనం
  • పవన్, క్రిష్ మూవీలో స్పెషల్ సాంగ్ ఆఫర్
  • వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనసూయ    
Anasuya to do special song for Pawan movie

బుల్లితెరపై హాట్ యాంకర్ గా తనదైన ముద్ర వేసిన అనసూయ ఇటీవలి కాలంలో ఆర్టిస్టుగా కూడా బిజీ అయింది. ఆమధ్య వచ్చిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో తన అభినయాన్ని అదరగొట్టింది. తదనంతరం ఆమెకు పలు సినిమాల నుంచి ప్రాధాన్యత వున్న పాత్రలు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ఖిలాడీ', కృష్ణవంశీ రూపొందిస్తున్న 'రంగమార్తాండ', సునీల్ హీరోగా నటించే 'వేదాంతం రాఘవయ్య' సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. మరోపక్క, తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో కూడా నటిస్తోంది.

ఇదిలావుంచితే, తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నుంచి కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించే అవకాశం అనసూయకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. గతంలో పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఐటం సాంగులో నటించే ఛాన్స్ వచ్చినా ఆమె చేయలేకపోయిన విషయం విదితమే.