ఆర్ఆర్ఆర్ పతాక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం

19-01-2021 Tue 19:25
  • ఆర్ఆర్ఆర్ నుంచి లేటెస్ట్ అప్ డేట్
  • భారీ క్లైమాక్స్ షూటింగ్ మొదలు
  • రామరాజు, భీమ్ పోరాటం అంటూ చిత్రబృందం వెల్లడి
  • స్పందించిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
 RRR Climax shooting starts

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైనట్టు చిత్రబృందం వెల్లడించింది. భారీ క్లైమాక్స్ షూటింగ్ మొదలైంది. బలాఢ్యుడైన భీమ్, రౌద్రం నిండిన రామరాజు తాము అనుకున్నది సాధించడానికి ఒక్కటయ్యారు. పెద్ద తెరలపై అలరించేందుకు ఈ అద్భుతమైన చిత్రం త్వరలోనే మీ వద్దకు వస్తోంది అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ ట్వీట్ చేసింది. దీనిపై ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు.

నా రామరాజు, నా భీమ్ కలసికట్టుగా పోరాడుతున్నారంటూ రాజమౌళి ట్వీట్ చేయగా... ఎంతో ఉద్విగ్నంగా ఉందని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. బాగా కిర్రెక్కిపోయాం అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియో మోరిస్ ఇందులో కథానాయికలు. బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.