Melania Trump: ఇక సెలవు... అమెరికా ప్రథమ మహిళ హోదాలో మెలానియా చివరి సందేశం

  • జనవరి 20న అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు
  • ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్
  • సంప్రదాయం ప్రకారం సందేశం వెలువరించిన మెలానియా
  • తనకు దక్కిన గొప్పగౌరవం అంటూ వ్యాఖ్యలు
  • ఒకే కుటుంబంలా వ్యవహరించాలంటూ అమెరికన్లకు సూచన
Melania Trump message to Americans

జనవరి 20న అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా మాజీ అవుతారు, ఆయన భార్య మెలానియా కూడా మాజీ ప్రథమ మహిళ అవుతారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ సంప్రదాయాన్ని పాటిస్తూ మెలానియా అమెరికా ప్రజలకు వీడ్కోలు సందేశాన్ని వెలువరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

అమెరికా ప్రతిష్ఠను మరింత పెంచేలా ప్రజలందరూ ఒకే కుటుంబంలా వ్యవహరించాలని, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాను ఒక్కతాటిపై నిలిపే అంశాలపై దృష్టి సారించాలని మెలానియా యువతకు ప్రత్యేకంగా సూచించారు. తాను హింసకు వ్యతిరేకం అని, హింస దేనికీ సమాధానం కాదని స్పష్టం చేశారు. అమెరికా ప్రథమ మహిళగా ఉండడం తన జీవితంలో లభించిన అత్యంత గొప్ప గౌరవం అని పేర్కొన్నారు.

కరోనా వేళ వెలకట్టలేని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, సైనికులు, న్యాయసిబ్బంది, తల్లులు, చిన్నారులు... ప్రతి ఒక్కరికీ తన హృదయంలో సముచిత స్థానం ఉందని ఆమె ఉద్ఘాటించారు. కాగా, తన చివరి అధికారిక సందేశంలో మెలానియా భావి ప్రథమ మహిళ జిల్ బైడెన్ గురించి ప్రస్తావించకపోవడం విమర్శలకు దారితీసింది.

More Telugu News