ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ!

19-01-2021 Tue 18:07
  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ మీడియా సమావేశం
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు లోక్ సభ
  • సమావేశాలకు ముందు ఎంపీలకు కరోనా పరీక్షలు
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు
Loksabha speaker Om Birla press meet over parliament budget sessions

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు జరుగుతాయని వివరించారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, జీరో అవర్ తో పాటు సభలో సాధారణ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని స్పీకర్ స్పష్టం చేశారు. సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఈ నెల 27, 28 తేదీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

గత సెప్టెంబరులో జరిగినట్టే లోక్ సభ, రాజ్యసభ చాంబర్లలో సమావేశాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగం కోసమే పార్లమెంటు సెంట్రల్ హాల్ ను వినియోగిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే, బడ్జెట్ అంతా డిజిటల్ విధానంలోనే వుంటాయని తెలిపారు. అంతేకాకుండా, పార్లమెంటు ఆవరణలోని అన్ని క్యాంటీన్లలో ఇకపై ఆహార పదార్థాలపై రాయితీని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.