టీడీపీ నేత దేవినేని ఉమను విడుదల చేసిన పోలీసులు

19-01-2021 Tue 17:49
  • ఈ ఉదయం గొల్లపూడిలో దేవినేని ఉమ అరెస్ట్
  • తొలుత ఇబ్రహీంపట్నం స్టేషన్ లో ఉంచిన పోలీసులు  
  • తర్వాత పమిడిముక్కల పీఎస్ కు తరలింపు
  • ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు
Former minister Devineni Uma released from Pamidimukkala police station

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. కాగా, ఈ ఉదయం కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య పమిడిముక్కల పీఎస్ కు ఆయనను తరలించారు.

తొలుత గొల్లపూడి నుంచి పోలీసుల కాన్వాయ్ ఈలప్రోలు దిశగా వెళ్లడంతో ఉమను మైలవరం కానీ, ఇబ్రహీంపట్నం కానీ తీసుకెళతారని టీడీపీ శ్రేణులు భావించాయి. ఉమను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆ వెంటనే ఆయనను పమిడిముక్కల పీఎస్ కు తీసుకెళ్లారు.

దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పమిడిముక్కల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పలు యత్నాలు చేశారు. చివరికి ఉమను ఈ సాయంత్రం విడుదల చేశారు.

ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ దేవినేని ఉమ ఈ ఉదయం గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.