ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' మొదలైంది

19-01-2021 Tue 16:16
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' 
  • శ్రీరాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్
  • మోషన్ క్యాప్చర్ తో ప్రారంభం
  • వీఎఫ్ఎక్స్ టీమ్ తో దర్శకుడి ఫొటో  
Adipurush started with motion capture work

తాజాగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని పూర్తిచేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూడు భారీ చిత్రాలలో 'ఆదిపురుష్' ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి నుంచీ పలు విశేషాలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా కావడంతో దీనికి మరింత క్రేజ్ ఏర్పడింది.

కాగా, ఈ రోజు ఈ చిత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వీఎఫ్ఎక్స్ పనులను మొదలెట్టారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడిస్తూ, 'మోషన్ క్యాప్చర్  ప్రారంభమైంది. ఆదిపురుష్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డాం..' అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటుగా చిత్రానికి పనిచేస్తున్న వీఎఫ్ఎక్స్ టీమ్ సభ్యులతో కలసి తాను దిగిన ఫొటోను కూడా దర్శకుడు పోస్ట్ చేశారు.

ప్రఖ్యాత పౌరాణికగాథ రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, విలన్ గా లంకేశ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నాడు. ఇక కథానాయిక సీత పాత్రధారి ఎవరన్నది అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ, బాలీవుడ్ నటి కృతి సనన్ పోషిస్తుందని అంటున్నారు.