నేను పడిన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తారా అనుకున్నా: విజయ్ దేవరకొండ

19-01-2021 Tue 14:51
  • విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కలయికలో 'లైగర్'
  • నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల
  • సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్
  • సంతోషం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda overwhelmed the response to Liger first poster

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం టైటిల్ ను నిన్ననే ఆవిష్కరించారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్రబృందం పంచుకుంది. వీటికి సోషల్ మీడియాలో వస్తున్న ప్రజాదరణ పట్ల హీరో విజయ్ దేవరకొండ సంతోషంతో పొంగిపోతున్నాడు. ఓ సమయంలో ఈ సినిమా కోసం తాను పడిన శ్రమను ఎవరైనా గుర్తిస్తారా... అసలు, థియేటర్లకు జనాలు వస్తారా? అని భావించానని, కానీ అభిమానుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని విజయ్ ట్వీట్ చేశాడు.

"నా ప్రియమైన అభిమానులారా.... నిన్న మీరు నన్ను ఎంతో సంతోషకరమైన భావోద్వేగాల్లో ముంచెత్తారు. 'లైగర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాక సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు నన్ను కదలించివేశాయి" అంటూ స్పందించారు. అంతేకాదు, ఈ చిత్ర నిర్మాత చార్మీ ట్వీట్ చేసిన వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోలో అభిమానులు విజయ్ దేవరకొండ పోస్టర్లకు పాలాభిషేకాలు చేయడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం చూడొచ్చు.