Doctors: సైనికుల మరణాల కన్నా డాక్టర్ల మరణాలు 7 రెట్లు ఎక్కువ!

  • గతేడాది కరోనా పోరులో 734 మంది డాక్టర్ల మృతి
  • సరిహద్దుల్లో 106 మంది సైనికుల వీరమరణం
  • మొదట్లో కరోనా నుంచి సరైన రక్షణ లేదంటున్న డాక్టర్లు
  • పీపీఈ కిట్లు చాలినన్ని లేకపోవడం కూడా కారణమే 
India lost seven times more doctors than soldiers in 2020

2020.. ప్రపంచానికి ఓ కామన్ శత్రువు కరోనాను ఇచ్చింది. అన్ని దేశాల యుద్ధమూ దానితోనే. మహమ్మారి అంతమే లక్ష్యంగా వ్యాక్సిన్ అనే ఆయుధాన్నీ తయారు చేశాయి. కానీ, ఆయుధం రావడానికి ముందు ఆస్పత్రుల్లోనే అతిపెద్ద యుద్ధం జరిగింది. కొన్ని లక్షల మంది మంచం పట్టారు. కొందరు కోలుకున్నారు.. మరికొందరు చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో ముందు వరుస యోధులైన డాక్టర్లూ ఉన్నారు.

మరి, మన దేశంలో ఇప్పటిదాకా ఎంత మంది డాక్టర్లు చనిపోయారు? అంటే వచ్చే సమాధానం.. సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికుల కన్నా.. కరోనాతో పోరాడుతూ వీరమరణం పొందిన డాక్టర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ. గతేడాది 106 మంది సైనికులు చనిపోతే.. 734 మంది వైద్యులు కరోనా కారణంగా కన్నుమూశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.  

‘‘కరోనా వైరస్ అనేది ఓ కొత్త వైరస్. దానిని ఎలా కట్టడి చేయాలో మొదట్లో డాక్టర్లకు తెలియలేదు. ఆరంభంలో వ్యక్తిగత రక్షణ కవచాలు (పీపీఈ కిట్లు) చాలినన్ని  లేకపోవడం వల్ల.. వైద్యులకు వైరస్ చాలా వేగంగా సోకింది. ఎక్కువ మంది వైద్యులను పొట్టనపెట్టుకుంది’’ అని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ హరిజిత్ సింగ్ భట్టి అన్నారు.

కేసులు నమోదైన మొదట్లో డాక్టర్లు 14 రోజులు డ్యూటీ చేసేవారు. తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండేవారు. అయితే, ఆ తర్వాత కేసుల తాకిడి పెరిగిపోవడంతో క్వారంటైన్ అనేది లేకుండా అయిపోయింది. విధాన నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం, సరైన మౌలిక వసతులూ కల్పించకపోవడమూ డాక్టర్ల మరణాలు ఎక్కువవడానికి కారణమైంది. కాగా, చాలా మంది వైద్యులకు అప్పటికే వేరే జబ్బులు ఉండడమూ మరణాలు పెరగడానికి కారణమైందని ముజఫర్ పూర్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బినయ్ శర్మ చెప్పారు.

More Telugu News