రైతు సంఘాల్లో చీలిక వచ్చిందా?

19-01-2021 Tue 14:09
  • రెండు సంఘాల నేతల మధ్య విభేదాలు
  • బీకేయూ నేత చదూనీ రూ.10 కోట్లు తీసుకున్నాడని మరో సంఘం నేత ఆరోపణ
  • తిప్పికొట్టిన చదూనీ.. పార్టీలతో సమావేశం నిజమేనని వెల్లడి
  • తమకు దూరంగా ఉండాలని చదూనీకి ఎస్కేయూ ఆదేశం
Talks with govt First sign of rift among farmer unions

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చట్టాల్లో సవరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా.. చట్టాల రద్దు మాత్రమే తమకు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు రైతు సంఘాల్లో చీలిక వచ్చినట్టు కనిపిస్తోంది. భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ– హర్యానా)కు చెందిన గుర్నమ్ సింగ్ చదూనీ, సర్వ హిందూ రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (మధ్యప్రదేశ్)కు చెందిన శివ కుమార్ కక్కాజీల మధ్య విభేదాలొచ్చాయి.

హర్యానా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు రూ.10 కోట్లకు ఓ రాజకీయ పార్టీతో చదూనీ ఒప్పందం చేసుకున్నాడని కక్కాజీ చెప్పినట్టు ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇస్తామంటూ ఆ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన అన్నట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో కక్కాజీ ఓ ‘ఆరెస్సెస్ ఏజెంట్’ అని చదూనీ విమర్శించారు. దీంతో రైతు సంఘాల్లో చీలిక వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయ పార్టీలతో సమావేశమైన మాట వాస్తవమేనని చెప్పిన చదూనీ.. భవిష్యత్తులో ఇక అలాంటి సమావేశాలకు హాజరు కానని చెప్పారు. అయితే, రైతుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం).. ఆందోళనకు దూరంగా ఉండాలంటూ చదూనీకి సూచించింది. ఆయన సమావేశంతో తమకేం సంబంధం లేదని చెప్పింది. ఈ విషయంపై తేల్చేందుకు కమిటీ వేసినట్టు వివరించింది.

దీనిపై కక్కాజీ కూడా వివరణ ఇచ్చారు. ‘‘చదూనీ ఓ రాజకీయ పార్టీ నుంచి రూ.10 కోట్లు తీసుకున్నారని నేను అన్నట్టు ఓ పత్రికలో వార్త వచ్చింది. అయితే, నేను అలా అనలేదు. చదూనీ నా స్నేహితుడు. వార్తా పత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నా’’ అని అన్నారు.