రామాలయానికి దిగ్విజయ్​ విరాళం రూ.1.11 లక్షలు.. ప్రధానికి చెక్కు పంపిన డిగ్గీ రాజా

19-01-2021 Tue 12:05
  • సరైన ఖాతాలో వేయాలంటూ ఎద్దేవా
  • ఏ బ్యాంకులో వేయాలో తెలియక చెక్కు పంపుతున్నానన్న ఎంపీ
  • కత్తులు, లాఠీలు పట్టుకుని విరాళాలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణ
  • తన రక్తంలోనూ రాముడున్నాడని వ్యాఖ్య
Digvijaya Singh sends cheque of Rs 111111 to PM Modi for Ram Mandir construction

అయోధ్య రామమందిరానికి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ విరాళమిచ్చారు. కానీ, ఓ షరతు పెట్టారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట రాసిన రూ.1,11,111 చెక్కును సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పంపించారు. దానితో పాటు ఓ లేఖనూ పంపారు.

రామాలయ విరాళాలు ఏ బ్యాంకు ఖాతాలో వేయాలో తెలియక ఇలా చెక్కు పంపుతున్నానని ఆ లేఖలో దిగ్విజయ్ పేర్కొన్నారు. తాను పంపిన మొత్తాన్ని ‘సరైన  బ్యాంకు ఖాతాలోనే’ జమ చేస్తారని ఆశిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. తనకు, తన పూర్వీకులకూ శ్రీరాముడిపై అపారమైన విశ్వాసముందన్నారు. రాముడు లేకుండా తమ ఉనికే లేదన్నారు. మధ్యప్రదేశ్  రాఘోగఢ్ లోని తమ ఇంట్లో ఓ రామాలయం ఉందన్నారు.

ఆ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. రోజూ రాముడి విగ్రహానికి పూజలు, అభిషేకాలు చేస్తామన్నారు. తన ప్రతి రక్తపు బొట్టులో రాముడు ఉన్నాడని, కానీ, రాజకీయాల కోసం ఎప్పుడూ రాముడిని వాడుకోలేదని అన్నారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమన్నారు. రాముడికి జాతీయవాదంతో సంబంధం లేదన్నారు. మతం అన్నది ఓ వ్యక్తికి, దేవుడికి మధ్య ఉన్న వ్యక్తిగత విషయమంటూ మహాత్మా గాంధీ చెప్పారన్నారు.

కాగా, విశ్వ హిందూ పరిషత్ విరాళాల సేకరణ మొదలు పెట్టడానికి ముందే వేరే సంస్థలూ విరాళాలు సేకరిస్తున్నాయని దిగ్విజయ్ చెప్పారు. కొందరు లాఠీలు, ఆయుధాలు, కత్తులు పట్టుకుని విరాళాలు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. గతంలో వీహెచ్ పీ వసూలు చేసిన విరాళాలనూ బహిరంగ పరచాలని ప్రధానిని దిగ్విజయ్ కోరారు.