Lakshadweep: సీన్​ రివర్స్: నిన్నటిదాకా కరోనా లేని ఆ ప్రాంతంలోనూ మొట్టమొదటి కేసు!

  • లక్షద్వీప్ లో నమోదైన మొదటి కరోనా కేసు
  • కవరట్టిలో రిజర్వ్ బెటాలియన్ వంటవాడికి పాజిటివ్
  • అతడు కలిసిన వాళ్ల కోసం గాలింపు
Lakshadweep reports its first Covid 19 case

లక్షద్వీప్.. నిన్నటిదాకా కరోనా బూచి తొంగి చూడని ప్రాంతం అదొక్కటే. దేశంలో అన్ని రాష్ట్రాలూ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నా.. ఆ ఒక్క కేంద్రపాలిత ప్రాంతం మాత్రం దీటుగా నిలబడింది. ఒక్క కేసు రాకుండా కాపాడుకుంది. అందుకు ఎన్నెన్నో చర్యలు తీసుకుంది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అక్కడికీ కరోనా చేరింది. మొదటి కేసు నమోదైంది.

సోమవారం తొలిసారిగా లక్షద్వీప్ లోని కవరట్టిలో కరోనా మొదటి కేసు నమోదైంది. అక్కడి కొవిడ్ ఆస్పత్రికి ఆ పేషెంట్ ను తరలించి చికిత్స చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన వ్యక్తిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన వంటవాడిగా గుర్తించినట్టు చెప్పాయి. జనవరి 4న ఓడలో లక్షద్వీప్ కు బయల్దేరాడని, దాదాపు రెండు వారాల తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలిందని వెల్లడించాయి.

ట్రూనాట్ టెస్ట్ ద్వారా అతడికి కరోనా ఉన్నట్టు సిబ్బంది నిర్ధారించారు. ప్రస్తుతం అతడిని కలిసిన వారి గురించి అధికారులు వెతుకుతున్నారు. అందరూ కవరట్టిలోనే ఉండి ఉంటారని భావిస్తున్నారు. మరికొందరికీ కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గతేడాది డిసెంబర్ 28న క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. కొచ్చి సహా లక్షద్వీప్ లోనూ క్వారంటైన్ అవసరం లేకుండానే ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ఆ నిబంధన మార్చిన మూడు వారాల్లోనే అక్కడ తొలి కేసు నమోదైంది.

More Telugu News