పెళ్లాడతానంటూ టీవీ నటిని నమ్మించి, పలుమార్లు అత్యాచారం చేసిన పైలెట్!

19-01-2021 Tue 11:37
  • ముంబైలో జరిగిన ఘటన
  • మ్యాట్రిమోనియల్ సైట్ లో నటికి పరిచయమైన వ్యక్తి
  • నమ్మించి పలుమార్లు అత్యాచారం
Mumbai Actress Accuses Pilot of Rape

తనను పెళ్లాడతానని వాగ్దానం చేసిన ఓ పైలెట్, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఇప్పుడు ముఖం చాటేశాడని చెబుతూ, ఓ టీవీ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టీవీ సీరియల్స్ లో నటిగా ఉన్న బాధితురాలు, ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో వివాహం నిమిత్తం తన వివరాలు నమోదు చేసుకుంది.

ఆపై, ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలెట్ గా పనిచేస్తున్న వ్యక్తి పరిచయం అయ్యాడు. వారిద్దరి పరిచయం తొలుత సోషల్ మీడియా మాధ్యమంగా, ఆపై ఫోన్ కాల్స్ వరకూ సాగింది. పది రోజుల క్రితం, ఆమెను కలవాలని నిందితుడు కోరగా, అంగీకరించిన ఆమె, అతనున్న ప్రాంతానికి వెళ్లింది. ఆపై ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిన పైలెట్, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై నిత్యమూ అదే పని చేసి, ఆపై ఆమెతో మాట్లాడటం మానేశాడు.

అతను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో ఇటీవల అతనితో మాట్లాడేందుకు బాధితురాలు ప్రయత్నించగా, వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.