దేవినేని ఉమ అరెస్ట్.. గొల్ల‌పూడిలో తీవ్ర‌ ఉద్రిక్త‌త‌

19-01-2021 Tue 11:31
  • కొడాలి నాని వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా దేవినేని దీక్ష‌
  • అడ్డుకున్న పోలీసులు
  • వైసీపీ, టీడీపీ పోటాపోటీ నినాదాలు
police arrests devineni uma

గొల్లపూడిలో నిన్న‌ జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని పాల్గొని టీడీపీ నేత‌ దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకి ఓ స‌వాలు విసిరారు. తాను ఎప్పుడైనా స‌రే గొల్ల‌పూడికి వస్తాన‌ని, ప్ర‌జ‌ల‌కు చంద్రబాబు ఏం చేశారో, సీఎం జగన్‌ ఏం చేశారో చెబుతాన‌ని అన్నారు. దేవినేని ఉమ‌ ఇంట్లో అయినా సరే తాను చర్చకు రెడీ అని సవాల్‌ విసిరారు. దీంతో చ‌ర్చ‌కు రావాలంటూ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్షకు దిగ‌బోయిన దేవినేని ఉమను దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు.

'మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చుంటా అంటే ఎందుకంత భయం? టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడికోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? మీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరు. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరని తెలుసుకోండి వైఎస్ జ‌గ‌న్ అంటూ ఈ సంద‌ర్భంగా దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

దీంతో గొల్లపూడి సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జగన్ కి వ్య‌తిరేకంగా టీడీపీ కార్యకర్తలు, దేవినేని ఉమ‌కు వ్య‌తిరేకంగా ‌వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

మ‌రోవైపు, వైసీపీ తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిప‌డ్డారు. కొడాలి నాని నోటికొచ్చినట్లు వాగుతున్నార‌ని, ఆయ‌న‌కు బుద్ధి చెప్పాలంటే దేవినేని ఉమ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. బూతుల మంత్రి కొడాలి నానిని జగన్ అదుపుచేయ‌ట్లేద‌ని అన్నారు. అలాగే, పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.