ఆ రైలుతో బైడెన్ కు 40 ఏళ్ల అనుబంధం.. అయినా ఎక్కడానికి అనుమతించని సెక్యూరిటీ!

19-01-2021 Tue 09:52
  • రేపు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్
  • రైల్లో స్వగ్రామం నుంచి వచ్చేందుకు అనుమతి నిరాకరణ
  • ఆ రైలులో దాదాపు 8,200 ట్రిప్పులు తిరిగానన్న బైడెన్  
Security Didnot Given Permission to Biden for Train Travel

అమెరికా అధ్యక్షునిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్, 40 ఏళ్ల అనుబంధమున్న రైలును ఇక వదులుకోవాలేమో. ప్రమాణ స్వీకారానికి తన సొంత పట్టణమైన డెలావర్ రాష్ట్రంలోని విల్ మింగ్టన్ నుంచి వాషింగ్టన్ కు ప్రయాణించే రైల్లో వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకోగా, ఇటీవల క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన దాడి నేపథ్యంలో, భద్రతా సిబ్బంది ఈ ప్రయాణానికి నిరాకరించింది. దీంతో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందే బైడెన్, తన కోరికను వదులుకోవాల్సి వస్తోంది.

కాగా, 1972లో డెలావర్ నుంచి సెనెటర్ గా ఎంపికైన తరువాత, నిత్యమూ ఈ రైల్లోనే బైడెన్ ప్రయాణించారు. అదే సమయంలో బైడెన్ భార్య, కుమార్తె ఓ ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు అబ్బాయిల బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, వారి ఆలనా, పాలన కోసం ఈ రైల్లో నిత్యమూ రాకపోకలు సాగించారు. ఇక వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన సమయంలోనూ ఆయన ఈ రైలు ప్రయాణాన్ని వదిలేయలేదు. అందుకే అయన సహచరులు 'ఆమ్ ట్రక్ జో' అని ఆయన్ను ఆటపట్టిస్తుంటారు కూడా.

ఇక 2011లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న వేళ, స్వగ్రామమైన విల్ మింగ్టన్ స్టేషన్ పేరును జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ రైల్ రోడ్ స్టేషన్ గా కూడా మార్చారు. తన జీవితంతో అంతగా పెనవేసుకుపోయిన ఈ రైలులో బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లలేకపోయినందుకు బైడెన్ చాలా బాధపడ్డారు కూడా.

"నేను ఈ రైల్లో దాదాపు 8,200 ట్రిప్పులు తిరిగాను. మొత్తం 20 లక్షల మైళ్లు ప్రయాణించినట్టు. గడచిన 36 ఏళ్లలో ఎన్నో పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు రాత్రి వచ్చేసరికి ఇంటికెళ్లి పిల్లలకు కథలు చెప్పేందుకు ఈ రైలు సహకరించింది. నా పనులను ఎన్నిటినో సాధ్యం చేస్తూ, విలువైన అనుభూతులను మిగిల్చింది. నా కష్టాల్లో, సుఖాల్లో భాగమైంది" అని అన్నారు.